జాషువా ఆశయాల సాధనకు కృషి చేయాలి
జహీరాబాద్‌లో ఘనంగా గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు
జహీరాబాద్ | ద్రవిడ శక్తి వెబ్‌డెస్క్
తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి బలమైన స్వరం వినిపించిన మహాకవి, పద్మభూషణ్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు జహీరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య సేవలను, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు అబ్రహం మాదిగ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి జాషువా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తన రచనల ద్వారా సామాజిక రుగ్మతలను ఎత్తిచూపి, సమసమాజం కోసం జాషువా సాహిత్యాన్ని ఆయుధంగా మలిచారని పేర్కొన్నారు.
జాషువా ఆశించిన సమసమాజం నిర్మాణానికి నేటి సమాజం ఆయన ఆశయాల బాటలో నడవాలని పిలుపునిచ్చారు. జాషువా సాహిత్యం, సామాజిక దృక్పథం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
“చెప్పులు కుట్టే వాని సేవకు భారతావని అప్పుపడ్డది సుమీ” అంటూ అట్టడుగు వర్గాల శ్రమను, సామాజిక వాస్తవాలను తన కవిత్వంలో ప్రతిబింబించిన జాషువా సేవలను అబ్రహం మాదిగ కొనియాడారు.పాల్గొన్న వారు కార్యక్రమంలో నిర్మల్ కుమార్ మాదిగ (మొగుడంపల్లి అధ్యక్షులు), దయానంద్ మాదిగ (కోహిర్ అధ్యక్షులు), జైరాజ్ మాదిగ, పద్మారావు మాదిగ, సుకుమార్, కిట్టు, మనోజ్, రజిని, పింటూ, అజయ్, రాజు, జాకబ్, వసంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
— ద్రవిడ శక్తి వెబ్‌డెస్క్