వందేమాతరం’పై సుప్రీంకోర్టులో పిటిషన్.. ఆరు చరణాలను వ్యతిరేకించిన మాజీ ఐఏఎస్ అధికారి
ద్రవిడ శక్తి జాతీయ డెస్క్: జాతీయ గేయం ‘వందేమాతరం’పై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ, విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆరు చరణాల వందేమాతరం గేయాన్ని ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బాలకృష్ణన్ సత్యభామ మావోజీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి గేయంలోని కొన్ని భాగాలు మతపరమైన భావాలను ప్రతిబింబిస్తున్నాయని, వాటిని ఆలపించాలని నిర్దేశించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 28, జూలై 9 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆరు చరణాల వందేమాతరం గేయాన్ని ఆలపించాలని నిర్దేశించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ‘ఆనందమఠం’ నవలలోని ఈ గేయాన్ని మతపరమైన యుద్ధ గీతంగా ఆయన అభివర్ణించారు. ఇందులో దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి హిందూ దేవతల ప్రస్తావనలు ఉన్నాయని, ఈ గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని కోరడం పౌరుల మనస్సాక్షి స్వేచ్ఛను ప్రభావితం చేస్తుందని వాదించారు. ఈ ఉత్తర్వులు రాజ్యాంగంలోని 14, 19, 21, 25, 28 అధికరణలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
స్వాతంత్ర్యానికి ముందు నుంచే జాతీయ గేయంగా ప్రాచుర్యం పొందిన ‘వందేమాతరం’లోని తొలి రెండు చరణాలు మాతృభూమి గొప్పతనాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తాయని పిటిషనర్ వివరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తొలి రెండు చరణాలనే ఆమోదించిన విషయాన్ని ప్రస్తావించారు. పూర్తి గేయాన్ని నిర్దిష్ట కార్యక్రమాల్లో ఆలపించాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు దేశ లౌకికవాదం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు.
వివాదాస్పద ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తొలి రెండు చరణాలనే జాతీయ గేయంగా అధికారికంగా గుర్తించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. మత విశ్వాసాలు లేదా మనస్సాక్షి కారణాలతో గేయాన్ని ఆలపించని వారిపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణతో పాటు మరికొందరు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా పిటిషన్‌పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది, కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల రాజ్యాంగబద్ధతపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అన్నది తదుపరి విచారణలో
తేలనుంది.