ఉన్నావ్ హైవే పక్కన అనుమానాస్పద బాక్సు.. తెరిచి చూడగా యువకుడి మృతదేహం
ద్రవిడశక్తి క్రైమ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నావ్–లాల్‌గంజ్ హైవే పక్కన అనుమానాస్పదంగా కనిపించిన ఓ పెద్ద బాక్సులో 32 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లలౌఖేడా గ్రామ సమీపంలోని సర్వీస్ లేన్‌పై మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీస్ ఔట్‌పోస్ట్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే బాక్సు పడివుండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. బాక్సును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
బాక్సులో ప్యాంటు, షర్టు ధరించిన యువకుడి మృతదేహం కనిపించింది. మృతుడి తలపై ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కళ్లకు, చెవుల సమీపంలో గాయాలు ఉండటంతో అతడిపై దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్పీ జయప్రకాశ్ సింగ్, సీఓ వినీ సింగ్, సదర్ కొత్వాల్ చంద్రకాంత్ మిశ్రా పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించింది.
యువకుడిని మరో ప్రాంతంలో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బాక్సులో పెట్టి వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో సమీపంలోని రాఘవ్ రిసార్ట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు స్వాట్, సర్వైలెన్స్ బృందాలను రంగంలోకి దించారు. మృతుడి గుర్తింపు, ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంపై అధికారులు దృష్టి సారించారు.
మృతదేహాన్ని రాయ్‌బరేలీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఉండవచ్చనే అనుమానంతో ఆ జిల్లా సహా సమీప ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు మృతుడి ఫొటోలను పంపించారు. సోషల్ మీడియా ద్వారా కూడా అతడి వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుడు ఎవరిని కలవడానికి వెళ్లాడు? అతడి మరణానికి కారణమేంటి? మృతదేహాన్ని తీసుకొచ్చిన వాహనం ఏది? అనే అంశాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతుడి గుర్తింపు, పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవ
కాశం ఉంది.