పాలకుర్తి గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
పాలకుర్తి, సెప్టెంబర్ 25: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో పాఠశాలలో నిద్రిస్తున్న 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం.
ఎలుకలు కరవడంతో విద్యార్థినుల చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో పాఠశాల సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గురుకుల పాఠశాలలో ఎలుకల బెడద ఎలా ఏర్పడింది? విద్యార్థినుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు ఏమిటనే అంశాలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.