భారత్–యూఏఈ వాణిజ్యం 100 బిలియన్ డాలర్లు దాటింది.. గల్ఫ్ పరిస్థితిపై జైశంకర్ ఆందోళన
ముంబై: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తర్వాత వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని వెల్లడించారు.
రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో సహకారం
ముంబైలో యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు జైశంకర్ స్వాగతం పలికారు. భారత్–యూఏఈ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత విస్తరిస్తోందని తెలిపారు.
ప్రపంచ ఆర్థిక సవాళ్లు, ప్రాంతీయ పరిణామాలు ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో సహకారం వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకుంటోందన్నారు.
గల్ఫ్ పరిస్థితిపై భారత్ ఆందోళన
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైశంకర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలు అవసరమని పేర్కొన్నారు.
వాణిజ్యం, ఇంధనం, ఎరువుల రవాణా స్వేచ్ఛగా, సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని భారత్ కోరుకుంటోందని స్పష్టం చేశారు.
భారతీయుల సంక్షేమానికి ప్రాధాన్యం
యూఏఈలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమానికి సహకరిస్తున్న ఆ దేశ నాయకత్వానికి జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధాలు మరింత బలోపేతం కావడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.