ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు భూమి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ
ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: గొంగళ్ళ రంజిత్ కుమార్
గద్వాల: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా TRS పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ధైర్యంగా నిలిచిన వీరనారి అని అన్నారు. అప్పటి భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువ, పేదలు, రైతుల హక్కుల కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
తనకు చెందిన భూమిని కాపాడుకోవడంతో పాటు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని తెలిపారు. మహిళలు కూడా సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడగలరని చాటిచెప్పిన స్ఫూర్తిదాయక మహిళగా చాకలి ఐలమ్మ నిలిచారని అన్నారు.
చాకలి ఐలమ్మ జీవితం, పోరాట స్ఫూర్తిని నేటి యువత తెలుసుకోవాలని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గొంగళ్ళ రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో TRS పార్టీ నాయకులు వెంకట్రాములు, ప్రేమ్ రాజ్, రంగస్వామి, సుభాష్, అంజి, MD సలీం, మౌసీన్, ఇంతియాజ్, రాముడు, హనీఫ్ తదితరులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.